విడుదల తేదీ : 09 ఆగష్టు 2014 TeluguWorld.wap.sh : 3.25/5 దర్శకుడు : రాజ కిరణ్ నిర్మాత : ఎంవివి సత్యనారాయణ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు నటీనటులు : అంజలి, శ్రీనివాస్ రెడ్డి, హర్షవర్ధన్ రాణే…
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న అంజలి ప్రధాన పాత్రలో, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘గీతాంజలి’. ప్రముఖ రచయిత కోనా వెంకట్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే – మాటలు అందించడమే కాకుండా సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. రాజ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ఎంవివి సత్యనారాయణ నిర్మాత. హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించారు. అంజలి తొలిసారి చేసిన ఈ హర్రర్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోదామని హైదరాబాద్లోని కృష్ణా నగర్ కి రోజూ చాలా మంది వస్తుంటారు. అలా డైరెక్టర్ అయిపోయి నంది అవార్డు అందుకోవాలనే టార్గెట్ తో వచ్చిన వాడే శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి). శ్రీనివాస్ తన ఫ్రెండ్ మధు(మధునందన్) తో కలిసి ఓ ఫ్లాట్ లో దిగుతాడు. ఆ ఫ్లాట్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానివల్ల వారు రోజూ పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
అనుకోకుండా ఓ జర్నీలో కలిసిన అంజలి(అంజలి) – శ్రీనివాస్ మంచి స్నేహితులవుతారు. రోజూ అంజలి శ్రీనివాస్ అపార్ట్ మెంట్ కి వస్తూ ఉంటుంది. కట్ చేస్తే అంజలికి ఆ అపార్ట్ మెంట్ కి ఓ సంబంధం ఉంటుంది. అసలు అపార్ట్ మెంట్ కి అంజలికి ఉన్న సంబంధం ఏమిటి? అంజలి కావాలనే శ్రీనివాస్ తో పరిచయం పెంచుకుందా? శ్రీనివాస్ రోజూ ఇబ్బందులు ఎదుర్కోవడానికి వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరుగుతోంది? అలాగే డైరెక్టర్ అవ్వాలని వచ్చిన శ్రీనివాస్ చివరికి డైరెక్టర్ అయ్యాడా? లేదా? అనేది మీరు వెండితెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్ గా మంచి ఇమేజ్ ఉన్న తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో నటించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్. సినిమాలో కంటెంట్ సంగతి పక్కన పెడితే అంజలి ఇమేజ్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. అంజలి ఈ సినిమాలో మంచి నటనని కనపరిచింది. డైరెక్టర్ ఎంచుకున్న పాత్రకి అంజలి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ సినిమాలో హీరో పాత్రకి ఇతనే పర్ఫెక్ట్ అనిపించేంతలా శ్రీనివాస్ రెడ్డి పెర్ఫార్మన్స్ ఉంది. కామెడీ సీన్స్ లో అతనికి ఎలాగో అనుభవం ఉంది కావున వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇక హర్రర్ సీన్స్ లో మంచి నటనని కనబరిచాడు. సినిమా మొత్తాని తన భుజాల మీదే నడిపించాడు.
జబర్దస్త్ టీవీ షో ద్వారా ఫేమస్ అయిన శకలక శంకర్ చేసిన కామెడీ ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ముఖ్యంగా అతను శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మని ఇమిటేట్ చేయడం బాగా నవ్వు తెప్పిస్తుంది. బ్రహ్మానందం క్లైమాక్స్ సీన్ లో బాగా నవ్వించాడు. రావు రమేష్ పాత్ర ఇందులో కొత్తగా ఉంటుంది. అలాగే అతని పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. అలీ, సత్యం రాజేష్, మధు నందన్ లు తమ పాత్రలకు న్యాయం చేయగా అతిధి పాత్రల్లో కనిపించిన హర్షవర్ధన్ రాణే, దిల్ రాజులు పాత్రల పరిధిమేర నటించారు.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగిపోవడం వలన ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో సప్తగిరి వచ్చేది ఒకే ఒక్క సీన్ అయినా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కాస్త పరవాలేదనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ మైనస్ పాయింట్ అంటే అది సెకండాఫ్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ లలో కామన్ ఆడియన్స్ కి బెటర్ అనిపించే ట్విస్ట్ ఇంటర్వల్ బ్లాక్. ఆ తర్వాత ఆడియన్స్ సినిమా దానికన్నా బాగుంటుంది అనుకుంటారు. కానీ సినిమాని చాలా రొటీన్ గా చేసేయ్యడమే కాకుండా సినిమా వేగాన్ని కూడా బాగా తగ్గించేసారు. అక్కడి నుంచి వచ్చే ట్విస్ట్ లు అన్నిటినీ ఈజీగా ఊహించేయవచ్చు. అలాగే ఈ సినిమా కథ ప్రేమకథా చిత్రమ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. మొత్తం అదేలా ఉంటే ఆ సినిమాకి కాపీ అంటారని సెకండాఫ్ ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుంచి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓం శాంతి ఓం’ నుంచి తీసుకొని ఇందులో పెట్టేసారు. కావున సెకండాఫ్ లో మీకు ఎక్కడా కొత్తగా అనిపించే చాన్స్ లేదు.
సైతాన్ రాజ్ గా బ్రహ్మానందం పాత్రకి చాలా హైప్ ఇచ్చారు. కానీ సినిమాలో బ్రహ్మానందం పాత్రకి అంత సీన్ లేదు. పైన చెప్పినట్టు క్లైమాక్స్ లో తప్ప మిగిలిన సీన్స్ లో బ్రహ్మి చేత చేయించిన సీన్స్ లో చాలా ఫోర్స్ కామెడీ ఉంటుంది. దానికి ఉదాహరణ – బ్రహ్మి – వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్. అందుకే బ్రహ్మి ప్రేక్షకులను నవ్వించలేకపోయాడు. అలాగే లాజికల్ గా ఈ సినిమాలో చాలా మిస్టేక్స్, లూప్ హోల్స్ ఉన్నాయి. మచ్చుకి ఒకటి చెబుతా.. ఎప్పుడో ఓ యాక్సిడెంట్ లో మట్టిలో కూరుకు పోయిన నిమ్మకాయ(నిమ్మకాయ గురించి చెబుతున్నాడు ఏంటా అనుకోవద్దు..ఎందుకు చెప్పాను అనేది సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది) ఎలా బయటకి వచ్చింది?. ఇలాంటివి ఇందులో చాలానే కనిపిస్తాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో ముందుగా మూడు డిపార్ట్ మెంట్స్ డీల్ చేసిన కోనా వెంకట్ గురించి చెప్పుకుందాం.. కథా విస్తరణ – సినిమాకి ఉపయోగపడని కథా విస్తరణ చాలా చేసారు. ఉపయోగం లేని విస్తరణ ఎంత చేసినా ఉపయోగం ఏముంది. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ కి బాగా రాసారు, సెకండాఫ్ ని ముంచేశారు. డైలాగ్స్ – జస్ట్ ఓకే. ఇక అసలు కథ – దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రాజ కిరణ్ గురించి చెప్పుకుందాం. కథ – కొత్తదనం ఏమీ లేదు. పలు సినిమాల మేళవింపే ఈ సినిమా కథ. దర్శకత్వం – ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో, సీన్స్ ని తీయడంలో బాగా సక్సెస్ అయ్యాడు. కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జత చేయాలని కాకుండా అనుకున్న కథని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇంకా బాగా సినిమా తీయగలడు.
సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా ఇచ్చిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. అలాగే ప్రవీణ్ లక్కరాజు పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటర్ ఉపేంద్ర సెకండాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
తీర్పు :
హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాలో హర్రర్ మిస్ అయ్యింది కానీ కామెడీ హిట్ అయ్యింది. ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను నవ్విస్తే, సెకండాఫ్ మాత్రం మరీ రొటీన్ గా ముందుకు సాగుతూ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, రావు రమేష్ ల పెర్ఫార్మన్స్, శకలక శంకర్ కామెడీ, ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే రొటీన్ అంటే చాలా రొటీన్ సెకండాఫ్, ఊహాజనితంగా ఉండే ట్విస్ట్ లు, లూప్ హోల్స్ చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్. అంజలి, బ్రహ్మానందం ఇమేజ్ ని బాగా వాడుకోవడం వలన మొదటి వారం ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం కూడా ఉంది.